- అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
ఖమ్మం రూరల్, వెలుగు : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలో గూడూరుపాడు గ్రామ అభివృద్ధికి రూ.8.50కోట్ల నిధులు మంజూరు చేశామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు నుంచి ఆకేరు వయా శ్మశానవాటిక వరకు రూ. 1.10 కోట్లు, ఎంవీపాలెం, గూడూరుపాడు రోడ్డు నుంచి గూడూరుపాడు చెరువు అలుగు వరకు రూ.3.30 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరుపాడు నుంచి గొర్లపాడు వరకు రూ.2.97 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. గూడూరుపాడు గ్రామానికి అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.35 లక్షలు, ఆరోగ్య ఉప కేంద్ర భవనానికి రూ.21 లక్షలతో, తాగునీటి కోసం రూ. 7 లక్షల మంజూరు చేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గూడూరుపాడు గ్రామానికి రూ. 8.50కోట్లు అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు.
స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు కోల్డ్ స్టోరేజ్ రోడ్డు మార్గం మంజూరు చేశామన్నారు. పేదలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇతర పథకాలను వివరించారు. అడిషనల్ కలెక్టర్ పీ.శ్రీనివాసరెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఆర్డీఓ నరసింహా రావు, ఎంపీడీఓ, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబు, ఆర్డబ్ల్యూఎస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
