
హైదరాబాద్, వెలుగు: రానున్న ఐదేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారం నాటికి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పొంగులేటి ప్రకటన విడుదల చేశారు. ‘‘ఈ ఏడాది ఇందిరమ్మ స్కీమ్ కింద నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4.5 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటో తేదీన జీతాలు చెల్లించే స్థాయికి చేరుకున్నాం.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజిక విధ్వంసానికి గురైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తన శక్తినంత కూడగట్టుకొని ఒక్కో అడుగు ముందుకేస్తూ.. ఇచ్చిన వాగ్దానాలు తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నది”అని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పరిమితిని పది లక్షలకు పెంచామని తెలిపారు. గృహ విద్యుత్ కనెక్షన్ పై 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ సప్లై చేస్తున్నామని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన 40 లక్షల మంది మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. మూడు నెలల్లోనే 29వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఉద్యోగాలకు వయో పరిమితి పెంచామని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పాలన: బల్మూరి
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. వంద రోజులుగా నిత్యం ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో వెంకట్ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఫ్రీ జర్నీ, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు అమలు చేశామని పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని, గ్రూప్ 1 పోస్టుల సంఖ్య పెంచామని, టెట్ పైనా నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.