- పెండింగ్ పనులపై మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష, రాత్రి మేడారంలో బస
ములుగు/తాడ్వాయి, వెలుగు: మేడారం మాస్టర్ ప్లాన్–2లో భాగంగా సుందరీకరణ పనులు చేపడతామని, జంపన్నవాగులో ఏడాది పొడుగునా నీళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాం నాయక్తో కలిసి వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గద్దెల చుట్టూ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జంపన్న వాగు, చిలుకలగుట్ట వద్ద పెండింగ్ పనులు, రోడ్లు పరిశీలించి, హరిత హోటల్లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నాలుగు రోజుల మహా జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి 55 లక్షల మంది భక్తులు తరలి వచ్చారని తెలిపారు. తల్లుల దర్శనానికి భక్తులు నిత్యం వస్తున్న దృష్ట్యా భద్రతతో కూడిన మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. జంపన్నవాగులో ఐదు చోట్ల చెక్ డ్యామ్లు ఏర్పాటు చేసి మూడు ఫీట్ల వరకు నీళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అటవీ ప్రాంతంలో ఇరుకైన రోడ్లతో ట్రాఫిక్ జామ్ జరుగుతోందని, రోడ్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. అనుమతులు రాగానే పనులు చేపడతామన్నారు. మౌలిక వసతులు కల్పించేందుకు 29 ఎకరాల భూమి సేకరించామని, అవసరమైతే మరింత భూమి సేకరిస్తామని వెల్లడించారు. గతంలో పాలకుల మాదిరిగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. పనులన్నీ మార్చి చివరి నాటికి పూర్తవుతాయని చెప్పారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ కారు కూతలు కుసినోళ్లకూ తల్లుల ప్రత్యేక దర్శనం కల్పించామని తెలిపారు. రాజకీయ విమర్శలు చేయొచ్చని, దేవుళ్లపై రాజకీయాలు చేయొద్దని సూచించారు. గత పాలకులు జాతరకు ముందు హడావుడి చేసి తరువాత మరిచిపోయే వారిన్నారు. మార్చి తరువాత మాస్టర్ ప్లాన్–2 పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారంలోని బస చేశారు.
