మంగళవారం ( జనవరి 13 ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన అనంతరం స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన అధికార పార్టీ సర్పంచులను సన్మానించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులు ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తోంటే వాళ్లకు గిట్టడం లేదని అన్నారు. మూడు సార్లు కర్రు కాల్చి వాత పెట్టినా వాళ్లకు సోయ లేదని అన్నారు పొంగులేటి.
నాలుగోసారి కూడా ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి జనం చెంప చెళ్ళు మనిపిస్తారని అన్నారు. ఇంకో పదేళ్ల తర్వాత అయినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందేమో చూద్దామని అన్నారు పొంగులేటి. 200 ఏళ్లకు కూడా చెక్కుచెదరకుండా సమ్మక్క సారాలమ్మ దేవాలయం అభివృద్ధి చేశామని అన్నారు పొంగులేటి. గిరిజనులకు, గిరిజనేతరులకు సమ్మక్క సారాలమ్మ దీవెనలు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో 72శాతం అభ్యర్థులను గెలిపించుకున్నామని... కాంగ్రెస్ పార్టీది పేదల ప్రభుత్వమని అన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి అశ్వారావుపేట పరిస్థితులు సీఎం రేవంత్ దృష్టిలో పెడుతూనే ఉన్నానని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల పట్ల సీఎం రేవంత్ కు ప్రత్యేక శ్రద్ధ ఉందని అన్నారు పొంగులేటి.
►ALSO READ | ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పేదవాడికి ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామని.. అశ్వారావుపేట కు అదనంగా వెయ్యి ఇళ్ళు కలిపి
4500 ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించామని అన్నారు.ఇంకా అడుగడుగునా అక్క చెల్లెమ్మలు తమకు ఇళ్ళు రాలేదను అడుగుతున్నారని.. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందని అన్నారు పొంగులేటి. ఉచిత కరెంటు, సన్నబియ్యమే కాక ఇంకా పేదవాడికి కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తామని అన్నారు పొంగులేటి.
కాంగ్రెస్ పెట్టని కోట లాంటిదని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు..నిస్వార్దంగా పేదవాడికి మంచిచేసే పనిలో సర్పంచ్ లు పాలు పంచుకోవాలని.. ఏ పేదవాడికి ఇబ్బంది పెట్టవద్దని అన్నారు పొంగులేటి.
