- మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి రైతులు తరాలిరావాలి
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- 2.5 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఖమ్మం టౌన్, వెలుగు : రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సోమవారం రఘునాథపాలెం మండలంలో రాములు తండా నుంచి చింతగుర్తి కొర్లబోడు తండా క్రాస్ రోడ్డు వరకు 2.5 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక సంస్థల అడిషనల్కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామానికి రూ.10 లక్షల రూపాయల గ్రాంట్ అందిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళలకు ప్రభుత్వం నాణ్యమైన చీరలను ఉచితంగా పంపిణీ చేసిందని, పెద్ద వయస్సు గల మహిళలకు ప్రత్యేకమైన డిజైన్ అందించామని తెలిపారు.
సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం లాంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తుచేశారు. రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకం పూర్తయిందని, ఆ ప్రాజెక్టు కింద నీళ్లు వదిలే కార్యక్రమానికి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
మండలంలో 3వ పంటకు సైతం సాగునీరు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రైతులు పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్ సాగు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి రఘునాథపాలెం మండలంలో రోడ్లు వేయిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, రాములు తాండ సర్పంచ్ బానోతు వెంకట్రాం, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
