
- మహిళల పేరిటే సంక్షేమ పథకాలు
నేలకొండపల్లి, వెలుగు : -కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, ఇందుకోసం మహిళల పేరిటే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబుతో కలిసి బుధవారం పలుగ్రామాల్లో పర్యటించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు రేషన్‌కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మహిళలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల మంది మహిళలకు సున్నా వడ్డీతో రూ. 25 వేల కోట్ల రుణాలు ఇచ్చామని చెప్పారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, రైస్‌మిల్లుల ఏర్పాటులో కూడా మహిళలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేండ్లలో రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ ఏర్పడిన ఏడాదిలోనే రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, సన్నవడ్లకు రూ. 500 బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, నాయకులు నెల్లూరి భద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శాఖమూరి రమేశ్, కొడాలి గోవిందరావు, బొడ్డు బొందయ్య పాల్గొన్నారు.