
- 18వ తేదీ నుంచి రెండో విడత శిక్షణ ప్రారంభం: మంత్రి పొంగులేటి
- గత పదేండ్లు సర్వే విభాగాన్ని పట్టించుకోలే
- రిజిస్ట్రేషన్ టైమ్‌లో సర్వే మ్యాప్ తప్పనిసరి అని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకంపై ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడత సర్వేయర్ల శిక్షణ పూర్తయిందని, రెండో విడత శిక్షణ 23 జిల్లా కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు.
అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటల్లోపు తమ జిల్లా సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు. సర్వేయర్ల సేవలు పారదర్శకంగా ఉండేలా సర్వే మాన్యువల్‌ను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రెవెన్యూ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించడానికి సర్వే డిపార్ట్మెంట్ బలోపేతం కావడం చాలా ముఖ్యమని, అందుకే ఈ విభాగంపై స్పెషల్ ఫోకస్ పెట్టామని తెలిపారు. గత పదేండ్లుగా సర్వే విభాగం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.
భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ టైమ్‌లో సర్వే మ్యాప్ తప్పనిసరి అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు అవసరమవుతాయని పేర్కొన్నారు. మొదటి విడతలో భాగంగా మే 26 నుంచి జులై 26 వరకు 50 పని దినాల్లో 7 వేల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. గత నెల 28, 29వ తేదీల్లో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష ఫలితాలను కూడా ప్రకటించామన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 40 రోజుల అప్రెంటిస్ శిక్షణ ఇప్పటికే ప్రారంభమైందని, ఇది పూర్తయిన వెంటనే వారికి లైసెన్స్ జారీ చేస్తామని చెప్పారు.