అధైర్యపడొద్దు.. అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం : మంత్రి పొంగులేటి

అధైర్యపడొద్దు.. అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం : మంత్రి పొంగులేటి
  •  గ్రామాల లింక్ రోడ్లు పూర్తి చేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఖమ్మం రూరల్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు రానివారు అధైర్యపడొద్దని, అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. గురువారం ఉదయం ఖమ్మం నగరంలోని 59వ డివిజన్, 60వ డివిజన్​లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. దానవాయిగూడెంలోని కార్తికేయ ఫంక్షన్ హాల్​లో 1వ, 59వ, 60వ డివిజన్లకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. గురువారం రాత్రి గోళ్లపాడు నుంచి రామన్నపేట వరకు రూ. 3.52 లక్షలతో  నిర్మించనున్న బీటీ రోడ్డు, పల్లెగూడెం -మంగళగూడెం ఆర్ అండ్​ బీ రోడ్డు నుంచి ఊటవాగు తండా వరకు రూ.75 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు, మంగళగూడెం నుంచి సర్వే నంబర్​ 272 వరకు రూ.1.65 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్, కొత్తూరు నుంచి లకావత్ తండా వరకు రూ.2.20 లక్షలతో బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో గ్రామాల లింక్ రోడ్లన్ని పూర్తి చేస్తామని, బురదలేని రోడ్లు ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా కొనసాగిస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఎవ్వరూ అధైర్య పడవద్దని, అర్హులందరికీ ఇండ్లు వస్తాయని చెప్పారు. మిగతా ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, డీఈ మహేశ్​బాబు, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, అధికారులు 
తదితరులు పాల్గొన్నారు.