
- టీచర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
- కుల్సంపురా గవర్నమెంట్స్కూళ్లు ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్/మెహిదీపట్నం, వెలుగు : సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కోట్లాది రూపాయలు వెచ్చించి మౌళిక వసతులు కల్పించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ ఏడాది టెన్త్క్లాస్స్టూడెంట్లు మంచి ఫలితాలు సాధించాలని స్టూడెంట్లకు సూచించారు. కార్వాన్ నియోజకవర్గంలోని కుల్సంపురా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మంత్రి పొన్నం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, తరగతి గదులను పరిశీలించారు. టెక్స్ట్‌బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, యూనిఫాం అందరికీ అందాయా అని అడిగి తెలుసుకున్నారు.
ప్రాథమిక పాఠశాలలోని మూడో తరగతి గదిలో కింద కూర్చొని స్టూడెంట్లతో ముచ్చటించారు. వివిధ సబ్జెక్టులలో వారిని ప్రశ్నించారు. బేసిక్ ఇంగ్లిష్‌పై పిల్లలు పట్టు సాధించేలా టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కొత్తగా కడుతున్న స్కూల్భవనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ.1,100 కోట్లతో రాష్ట్రంలోని 25 వేల ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామన్నారు. గత నెలలో టీచర్లకు పదోన్నతులు కల్పించి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూశామని చెప్పారు. త్వరలో ప్రతి స్కూల్‌కు ఫ్రీ కరెంట్అందిస్తామని తెలిపారు.
శానిటేషన్ సిబ్బంది, స్కావెంజర్ల కోసం ప్రతినెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. పిల్లలను టీవీలకు కాస్త దూరంగా ఉంచాలని, ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని మంత్రి పొన్నం సూచించారు. ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి స్టూడెంట్ జాదవ్ శ్లోక్ రూపొందించిన స్మార్ట్ పెస్టిసైడ్స్ స్ప్రేయర్ విధానం గురించి తెలుకొని అభినందించారు. కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డీఈఓ ఆర్.రోహిణి, హెచ్ఎం రుక్మిణి, డీడీ ఎస్సీ వెల్ఫేర్ పెరిక యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నేత ఉస్మాన్ బిన్ ఆల్ హజ్రి తదితరులు పాల్గొన్నారు.