బీసీలపై గత ప్రభుత్వానివన్నీ ఆర్భాటాలే: పొన్నం ప్రభాకర్

బీసీలపై గత ప్రభుత్వానివన్నీ ఆర్భాటాలే:  పొన్నం ప్రభాకర్

బషీర్ బాగ్, వెలుగు: బీసీలకు  గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని, అన్నీ ఆర్భాట ప్రకటనలే చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు, ఫెడరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, పైన పటారం, లోన లొటారం అనే చందంగా  వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. రవీంద్రభారతిలో వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశ్​ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వడ్డెర ఆత్మగౌరవ సభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కర్ణాటక బీసీ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ తంగడగి, జగద్గురువు శ్రీ ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామీజీలతో కలిసి మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడారు. 

రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ సర్కార్ ఖాళీ చేసి పోయిందని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై తమ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంను ప్రజలు అవగాహన చేసుకోవాలని కోరారు. వచ్చే ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయించి వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  మైనింగ్ ల్లో వడ్డెరలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారని, సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సూచించారు.