హుస్నాబాద్, వెలుగు: రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, అహంకారాన్ని విడిచిపెట్టి బేషరతుగా రాహుల్కు క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అమెరికాలో చదివిన కేటీఆర్ భాష ఇదేనా? అని నిలదీశారు. బుధవారం హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ దేనని.. గౌరవెల్లి, మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులపై అర్ధరాత్రి దాడి చేశారని ఆరోపించారు. రూ.21 వేల కోట్లు ఒకేసారి రుణమాఫీ చేసి రైతులకు ఊరట కల్పించామన్నారు.
వరంగల్ వేదికగా రైతు సమస్యలపై ఓపెన్ డిబేట్‌కు సిద్ధమని, ప్రతిపక్షాలు సిద్ధమా అని సవాల్ విసిరారు. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎం అన్న కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా.. ఇప్పుడు ఎంక్వైరీ అంటే ఎందుకు నోరుమెదపడం లేదని నిలదీశారు. కేసీఆర్ ఫ్యామిలీని కాపాడేందుకే రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సీబీఐ విచారణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
