కరువుపై కేసీఆర్​ అబద్ధపు ప్రచారం : పొన్నం ప్రభాకర్

కరువుపై కేసీఆర్​ అబద్ధపు ప్రచారం : పొన్నం ప్రభాకర్
  • కల్లాల వద్ద పండుడు కాదు సంజయ్..కేంద్రం నుంచి నిధులు తీస్కురా

కోహెడ, వెలుగు : కరువు కాంగ్రెస్​తో వచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. నాలుగు నెలలుగా మాట్లడని కేసీఆర్​ఇప్పుడు బయటకు వచ్చి కరువుపై రాజకీయం చేస్తూ.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నరని విమర్శించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.

కరువు కాంగ్రెస్​తోనే వచ్చిందని 200 మంది రైతులు చనిపోయారని జ్ఞానం లేకుండా మాట్లడడం సరికాదన్నారు. సెప్టెంబర్​లో వర్షాలు పడకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కనుక కరువుకు ఆ పార్టే కారణమని తాము అనడం లేదన్నారు. ప్రకృతి పరిస్థితులే ప్రస్తుత నీటి ఎద్దడికి కారణమన్నారు. కరువుకు, రాజకీయ పార్టీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు.

రాష్ట్రలో బీఆర్ఎస్, బీజేపీ ఒకే గొంతుకలా ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ రైతుల గురించి మాట్లాడంగానే ఎంపీ బండి సంజయ్ సైతం కల్లాలోకి వడ్లు రాకముందే కల్లాల వద్ద పడుకుంటామనడం విడ్డూరంగా ఉందన్నారు. సంజయ్​కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కరువు పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేలా కేంద్రం నుంచి నిధులు, ప్యాకేజీలు తీసుకురావాలన్నారు. కేంద్రం ఎంత సాయం ఇస్తే అంతకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కరువుపై బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నయని. తప్పుడు ప్రచారాలు మాని రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వంతో కలిసి రావాలని సూచించారు.