
హైదరాబాద్, వెలుగు: యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు, క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.480 కోట్లు కేటాయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్అన్నారు. ఈ నిధులను ఉపయోగించుకొని రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్ చాంపియన్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో 17వ నేషనల్ మినీ హ్యాండ్‌బాల్ బాయ్స్, గర్ల్స్ చాంపియన్ షిప్ పోటీలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ప్రారంభించారు.
4 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 22 జట్లు పాల్గొంటున్నాయి. పొన్నం మాట్లాడుతూ.. సీఎం రెవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు తగిన ప్రాధాన్యం దక్కుతోందన్నారు. ఈ కార్యక్రమంలో షాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్‌రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సుధీర్ రెడ్డి, జాతీయ హ్యాండ్ బాల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఉద్యమానికి కేంద్రబిందువు జలదృశ్యం
హైదరాబాద్‌సిటీ: తెలంగాణ సాధనకు జలదృశ్యం కేంద్ర బిందువుగా ఉద్యమం మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ జయంతి పోస్టర్ ను బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 69 శాతం రేజర్వేషన్లు బాపూజీ ఆకాంక్షించిన సామాజిక తెలంగాణను ప్రతిబింబిస్తున్నాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు పద్మావతి, మారేపల్లి లక్ష్మణ్, మంద వెంకటస్వామి, సిరిగంధం నాగరాజు పాల్గొన్నారు.
42 శాతం రిజర్వేషన్ల జీవోపై హర్షం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్రప్రభుత్వం జీవో తీసుకురావడంపై బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ హర్షం వ్యక్తం చేశారు.