వారంలోగా లష్కర్​ బోనాల ఏర్పాట్లు.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

వారంలోగా లష్కర్​ బోనాల ఏర్పాట్లు.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు వారం రోజుల్లో ఏర్పాట్లు పూర్తిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. జులై 5వ తేదీ వరకు డెడ్​లైన్​విధించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం ఆలయ ప్రాంగణంలో బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జులై 21న బోనాలు, 22న ఉదయం 9 గంటలకు రంగం, గజాధిరోహణ మహోత్సవం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని మంత్రి చెప్పారు.

‘మహాలక్ష్మి’ స్కీం అమలులో ఉన్నందున ఈసారి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ సంస్కృతికి పెద్దపీట వేస్తున్నామని, బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఆలయ పరిసరాల్లో స్పెషల్​లైటింగ్, అదనపు ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

వాటర్ పాకెట్స్, బాటిల్స్, ఆలయ ప్రాంగణంలో నాలుగు హెల్త్ క్యాంపులు, పీసీఆర్ బృందాలు, అంబులెన్స్,ఫైర్ ఇంజిన్​ను అందుబాటులో ఉంచాలన్నారు. మల్టీ లెవల్ పార్కింగ్ కల్పిస్తున్నామని, అంబారీ ఊరేగింపు కోసం వినియోగించే  ఏనుగు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఊరేగింపులో 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్,సెక్రటరీ హన్మంతరావు, సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు చీరా సుచిత్ర, కొంతం దీపిక, నార్త్​జోన్​ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్, దేవాలయ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.