- ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకించాలి
- 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీ/మెహిదీపట్నం, వెలుగు : హైదరాబాద్‌ను సీవరేజ్ ఓవర్ ఫ్లో సిటీగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. భూగర్భ జలాలు పెంచేందుకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత తవ్వించుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతల అవసరం, సీవరేజ్సమస్యలకు పరిష్కారం అంశాలపై వాటర్‌బోర్డు చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ ను మెహిదీపట్నం సరోజినిదేవి ఆస్పత్రి ఆవరణలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
భూమిపై పడిన ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చాలన్నారు. ఇందుకోసం ఇంకుడు గుంతలు తవ్వించుకోవాల్సి అవసరం ఉందని చెప్పారు. మురుగు కాల్వల్లో వ్యర్థాలు వేయొద్దని, ప్రవాహానికి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిటీని సీవరేజ్ఓవర్ ఫ్లో ఫ్రీగా మార్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. అలాగే ఇంకుడు గుంతల నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్, వాటర్‌బోర్డు ఈడీ మాయంక్ మిట్టల్ పాల్గొన్నారు. అంతకు ముందు లంగర్ హౌజ్ బాపూఘాట్ వద్ద గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం స్పెషల్ డ్రైవ్ కు సంబంధించిన పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.