మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగేందుకు సహకరించండి: మంత్రి పొన్నం

మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగేందుకు సహకరించండి: మంత్రి పొన్నం

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. జనవరి 19వ తేదీ శుక్రవారం ఆర్టీసీ అద్దె బస్సు యజమానులు ఎదుర్కుంటున్న సమస్యలపై హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో అద్దె బస్సుల యజమానులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని  స్వాగతిస్తూ.. తమ బస్సులపై పడుతున్న భారాన్ని అద్దె బస్సుల యజమానులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రయాణికులు అధికంగా ప్రయాణించడం వల్ల  కేఏంపీఎల్  పై ప్రభావం పడుతుందని వారు తెలిపారు.  గతంలో ఉన్నదానికి ప్రస్తుతానికి 2.75 నుండి 3 వ్యత్యాసం అవుతుందని.. ప్రస్తుతం కిలోమీటర్ కి ఇస్తున్న 35 రూపాయలకు అదనంగా 2 రూపాయలు పెంచాలని మంత్రిని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని.. ఉచిత ప్రయాణంపై అద్దె బస్సుల యజమానుల సహకారం ఉండాలని విజ్ఞప్తి చేశారు. అద్దె బస్సుల యజమానులతో చేసిన 10 సంవత్సరాల అగ్రిమెంట్ ప్రకారమే ముందుకు వెళ్తామని ... కొత్త అగ్రిమెంట్ వస్తే కొత్త ప్రతిపాదనలు ఉంటాయని ఆయన చెప్పారు. కేఎంపీఎల్ పై ఆర్టీసీ కమిటీలో చర్చిస్తామని.. ఇన్సూరెన్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటామని చెప్పారు.

అద్దె బస్సుల యజమానులు తమ సమస్యలపై ఎప్పుడైనా కలవచ్చని మంత్రి పొన్నం చెప్పారు. ప్రభుత్వంలో మీరు భాగస్వాములని.. బాధ్యతగా ఉండాలని అన్నారు. అద్దె బస్సుల యజమానుల సమస్యలపై నాలుగైదు రోజుల్లో అధికారులతో కలిసి మరోసారి సమావేశానికి పిలుస్తామని తెలిపారు. 

 అంతకుముందు.. 'మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్య' పథకం అమలు తీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు.  క్షేత్ర స్థాయిలో పథకం అమలవుతున్న తీరును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు.

సంక్రాంతి పర్వదినంలోనూ మహాలక్ష్మి స్కీంను అమలు చేస్తూ.. క్షేమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారని మంత్రి కొనియాడారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా త్వరలో మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరపున సహాయసహకారాలు సంస్థకు ఉంటాయని తెలిపారు. 

మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలు చేయడం వెనుక క్షేత్రస్థాయి సిబ్బంది డ్రైవర్, కండక్టర్ల కృషి ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. సిబ్బంది పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరించాలని ఆయనను కోరారు. సిబ్బంది పెండింగ్ సమస్యల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.