ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించి పార్టీలు మారినా వదలం: మంత్రి పొన్నం

ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించి పార్టీలు మారినా వదలం: మంత్రి పొన్నం
  • పార్టీలు మారగానే పునీతులు కావడానికి తమది బీజేపీ కాదని ఎద్దేవా
  • వీఐపీల డ్రైవర్లకు త్వరలో ఫిట్‌నెస్  టెస్టులు
  • బిహార్ తరహాలో కులగణన చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించిన నేతలు కొందరు ఇప్పుడు పార్టీలు మారినా వదిలేది లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  స్పష్టం చేశారు. అలాంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. పార్టీలు మారగానే పునీతులు కావడానికి తమది బీజేపీ కాదన్నారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్టీసీకి ఇంకా కొన్ని బకాయిలు కట్టాల్సి ఉందని తెలిపారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ప్రతిమ కూడా ఆర్టీసీకి బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆర్టీసీ ఆస్తులు ఉన్నాయో గుర్తించాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త డిపోల ఏర్పాటు ఆలోచన లేదు. బస్సుల కనెక్టివిటీని పెంచుతాం. ఇప్పుడిప్పుడే సంస్థ లాభాల బాట పడుతున్నది. మహాలక్ష్మి కింద ప్రయాణించే మహిళలకు కండక్టర్లు టికెట్లు కొడితే చర్యలు తీసుకుంటాం. 

ఇక ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చాం. అది అమలు చేస్తాం. గత బీఆర్ఎస్  సర్కారు గడిచిన తొమ్మిదేండ్లలో బీసీ సంక్షేమ శాఖ తరపున ఖర్చు చేసింది రూ.23 వేల కోట్లే” అని పొన్నం పేర్కొన్నారు.  కాగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్  అధికారుల వద్ద పనిచేసే డ్రైవర్లకు ఫిట్‌నెస్  టెస్టులు చేస్తామని పొన్నం తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లోనే ఈ ప్రక్రియ చేపడతామని ఆయన చెప్పారు. అనుభవం లేని డ్రైవర్లతో ఇటీవలి కాలంలో వీఐపీలు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని తెలిపారు. దూర ప్రాంతాలకు సెలెక్టెడ్  డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని, దీనిపై వీఐపీలందరికీ లెటర్లు రాస్తామని వెల్లడించారు. 

 లోక్ సభ నేపథ్యంలో బీజేపీ కొత్త డ్రామా

ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు వాయిదాల పద్ధతిలో వస్తున్నాయని, ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు ఉన్నందున బీజేపీ మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్  ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చేపట్టనున్న కులగణన బిహార్  తరహాలో అమలు చేస్తామని, దీనిపై అధికారులకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. బిహార్ లో 2.5 లక్షల మంది అధికారులను కేటాయించి ఒక్కొక్కరికి 150  ఇండ్లు అప్పగించారని, ఇక్కడ కూడా ఇండ్లను బట్టి అధికారులను నియమిస్తామన్నారు. రాష్ట్రంలో కోటి ఇండ్లు ఉన్నాయని, లక్ష మందితో టీంలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కులగణన పూర్తయిన తర్వాత అన్ని శాఖల్లో రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు.