
కోహెడ, వెలుగు: హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. శుక్రవారం పట్టణంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే ఇబ్బందులపై మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో హుస్నాబాద్మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో 139, రాష్ట్ర స్థాయిలో 9, జిల్లా స్థాయిలో ఒకటో ర్యాంక్ సాధించడం పట్ల అధికారులను, సిబ్బందిని అభినందించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఇప్పటికే గ్రామ గ్రామాన స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.పెళ్లిళ్లు, శుభ కార్యాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని స్టీల్ సామగ్రినే వాడాలని సూచించారు.
340 హోటళ్లలో 34 వేల స్టీల్ గ్లాసులు ఇచ్చామన్నారు. వర్షాకాలంలో ఇళ్లలోకి నీళ్లు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్‌ను సందర్శించి రోగులను పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్లో వాటర్ ప్లాంట్‌ను కావాలని రోగులు కోరగా 48గంటల్లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్శివ్వయ్య, మున్సిపల్కమిషనర్మల్లికార్జున్, ఆర్టీసీ డీఎం వెంకన్నపాల్గొన్నారు.