వేములవాడ వెలుగు : గత పదేండ్లలో కేంద్రంలో, రాష్ర్ర్టంలోని ప్రభుత్వాలు రాజన్న ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని, వేములవాడకు అమృత్ స్కీమ్ ఎందుకు తేలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మంగళవారం వేములవాడ భీమేశ్వర స్వామిని ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్‌తో కలిసి మంత్రి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మున్సిపాలిటీ లకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
రాజన్న ఆలయ అభివృద్ధిపై తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేశామని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ ఇక్కడికి వచ్చి ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధార్మిక, కార్మిక క్షేత్రాల అభివృద్ధి తమ ప్రభుత్వ బాధ్యతన్నారు. అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. హుస్నాబాద్ ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని, తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు.
