- జూబ్లీహిల్స్‌లో వందల మంది ప్రచారం చేసినా ఓటింగ్ శాతం పెరగలే..
- మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : నగరవాసుల కంటే గ్రామీణ ప్రాంత ప్రజలకే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఎక్కువని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ వంటి అత్యంత సంపన్న నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగితే.. మంత్రులు, ఉన్నతాధికారులు, సినీనటులు సహా వందలాది మంది ప్రచారం చేసినా పోలింగ్ 50 శాతం దాటలేదని గుర్తు చేశారు.
కానీ ఓ గ్రామంలో ఓటేసేందుకు వచ్చిన వృద్ధురాలిని మీడియా ప్రతినిధులు ‘ఇంత వయసులో వచ్చి ఓటు వేస్తున్నావు కదా.. ఎలా అనిపిస్తుంది ?’ అని అడిగితే, ‘ఓటు వేయకపోతే మనం లేనట్టే కదా.. ఓటు వేస్తేనే మనం ఉన్నట్టు’ అని సమాధానం చెప్పిందన్నారు. ఆ ఒక్క మాటే సామాన్య ప్రజలకు ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవాన్ని చాటుతోందన్నారు. గ్రామీణ ప్రజలు ఓటును హక్కుగా కాకుండా తమ ఉనికిగా భావిస్తారన్నారు.
నగరాల్లో అన్ని సౌకర్యాలు ఉన్న వారు ఓటేసేందుకు నిర్లక్ష్యం చూపుతుంటే... పల్లెల్లోని పేదలు ఓటేసేందుకు ఉత్సాహం చూపడం గర్వకారణం అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, టూరిజం రంగాల్లో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.
ఎల్కతుర్తి–-హుస్నాబాద్–సిద్దిపేట జాతీయ రహదారి పనులను స్పీడప్ చేయాలని, పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జీలు, కల్వర్టులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, పీఏసీఎస్ చైర్మన్ శివయ్య, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు పాల్గొన్నారు.
