పైరవీలకు అవకాశం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

పైరవీలకు అవకాశం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలనలో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా, హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి  పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. గురువారం బంజారాహిల్స్ వార్డ్ ఆఫీసు వద్ద ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 6వ తేదీ వరకు అభయహస్తంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. 

ప్రజలకు ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా అధికారులను అడగాలని సూచించారు.  ఎలాంటి ఆధారాలు లేకున్నా దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఆరు గ్యారంటీలతో పాటు మిగతా సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 

హైదరాబాద్  ఆదర్శంగా ఉండేలా ప్రోగ్రామ్ కొనసాగించాలని అధికారులను కోరారు. అనంతరం ప్రజాపాలన కౌంటర్లను పరిశీలించారు.  అన్ని విషయాల్లో ప్రభుత్వానికి బల్దియా నుంచి పూర్తి సహకారం ఉంటుందని, ప్రజాపాలన ద్వారా పార్టీలకు అతీతంగా న్యాయం జరగాలని మేయర్​ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఆరు గ్యారంటీల అమలును ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు.  ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, జోనల్ కమిషనర్  వెంకటేష్ ధోత్రే  తదితరులు పాల్గొన్నారు.