హేట్ స్పీచ్ బిల్లు పరిశీలన కమిటీ చైర్మన్‌‌ గా మంత్రి పొన్నం

హేట్ స్పీచ్ బిల్లు పరిశీలన కమిటీ  చైర్మన్‌‌ గా మంత్రి పొన్నం
  • అసెంబ్లీ, శాసనమండలికి చెందిన వివిధ కమిటీల ప్రకటన
  • అసెంబ్లీ, కౌన్సిల్ ఎథిక్స్ కమిటీల చైర్మన్లుగా రేవూరి ప్రకాశ్​, మహేశ్​ కుమార్ గౌడ్
  • అసెంబ్లీ పిటిషన్ల కమిటీ, ప్రివిలేజెస్ కమిటీలకు డిప్యూటీ స్పీకరే చైర్మన్‌‌
  • సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్‌‌గా కడియం శ్రీహరి.. పర్యావరణ కమిటీకి స్పీకరే సారథి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలికి సంబంధించిన వివిధ కమిటీల నియామకాలు జరిగాయి. వీటితో పాటు అత్యంత కీలకమైన 'తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల (నిరోధక) బిల్లు–2026' పరిశీలన కోసం ఒక ప్రత్యేక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక బులిటెన్లు విడుదలయ్యాయి. 2026–27 సంవత్సరానికి గానూ ఉభయ సభల సభ్యులతో కూడిన పలు ఉమ్మడి కమిటీలను, అసెంబ్లీ, కౌన్సిల్ పరిధిలోని ప్రత్యేక కమిటీలను స్పీకర్ నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి, కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ కోసం ఈ కొత్త బిల్లును ప్రతిపాదించారు. 

దీనిని లోతుగా పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చైర్మన్‌‌‌‌గా ప్రత్యేక సెలెక్ట్ కమిటీ ఏర్పాటయింది. ఇందులో  బాలూ నాయక్ నేనావత్, లక్ష్మీ కాంతారావు తోట, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్), డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, యశస్విని మామిడాల, దానం నాగేందర్, కోవ లక్ష్మి, కోనింటి మాణిక్యరావు, రాంరావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ బిల్లులోని అంశాలపై సమగ్రంగా చర్చించి, రానున్న 2026 వర్షాకాల సమావేశాల ముగింపు రోజున లేదా అంతకంటే ముందే తన నివేదికను సభకు సమర్పిస్తుంది.

శాసనసభ, శాసనమండలి ప్రత్యేక కమిటీలివే..

అసెంబ్లీ పిటిషన్ల కమిటీ, ప్రివిలేజస్ కమిటీలకు డిప్యూటీ స్పీకర్ చైర్మన్‌‌‌‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ హామీల కమిటీకి పట్లోళ్ల సంజీవరెడ్డి, రూల్స్ కమిటీకి స్పీకర్, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌‌‌‌గా రేవూరి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. అలాగే కౌన్సిల్ కమిటీలలో పిటిషన్లు, ప్రివిలేజస్ కమిటీలకు డిప్యూటీ చైర్మన్ నాయకత్వం వహిస్తారు. ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌‌‌‌గా కేతావత్ శంకర్, రూల్స్ కమిటీకి మండలి చైర్మన్, సభలో ప్రవేశపెట్టే పత్రాల పరిశీలన కమిటీకి చల్లా వెంకట్రామ్ రెడ్డి, ఎథిక్స్ కమిటీకి మహేష్ కుమార్ గౌడ్ బొమ్మ చైర్మన్‌‌‌‌గా వ్యవహరించనున్నారు. ఈ నియామకాలు 2026–-27 ఏడాదికి తక్షణమే అమలులోకి వస్తాయని నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్నారు.

నూతన చైర్మన్లు వీరే..

ఇక ఉభయ సభల సభ్యులతో కూడిన వివిధ సంక్షేమ, ఇతర ఉమ్మడి కమిటీల చైర్మన్లను కూడా ప్రకటించారు. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌‌‌‌గా కడియం శ్రీహరి ఎంపికయ్యారు. ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్‌‌‌‌గా మేడిపల్లి సత్యం, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌‌‌‌గా పాయం వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్‌‌‌‌గా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ బాధ్యతలు చేపట్టనున్నారు. మహిళలు, బాలలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌గా చిట్టెం పర్ణికా రెడ్డి, మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్‌‌‌‌గా లక్ష్మీ కాంతారావు తోట నియమితులయ్యారు. లైబ్రరీ కమిటీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌గా డాక్టర్ మట్టా రాగమయి వ్యవహరించనుండగా, వన్యప్రాణుల-పర్యావరణ పరిరక్షణ కమిటీకి, సదుపాయాల (అమెనిటీస్) కమిటీకి స్వయంగా అసెంబ్లీ స్పీకరే చైర్మన్‌‌‌‌గా వ్యవహరిస్తారు.