
- మంత్రి పొన్నం ప్రభాకర్
- జగిత్యాలలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానిష్కరణ
- నివాళులర్పించిన మంత్రులు వివేక్‌వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల టౌన్, వెలుగు : గౌడ కులస్తుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... బహుజనుల కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. సైన్యంలో సామాజిక న్యాయం పాటించి, గోల్కొండ ఖిలాను జయించారని చెప్పారు.
ఈ నెల 18న పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌చేతుల మీదుగా హైదరాబాద్‌లో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. గౌడ కులస్తుల సంక్షేమం కోసం రాష్ట్రంలో 40 లక్షల ఈత, ఐదు లక్షల తాటి మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ మంత్రి రాజేశంగౌడ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి చంద్రశేఖర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జ్యోతి లక్ష్మణ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన మంత్రులు
జగిత్యాలలోని గొల్లపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద బుధవారం మంత్రులు వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొగల్ పాలకులకు వ్యతిరేకంగా గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. కులవృత్తుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, గీత కార్మికుల కోసం రక్షణ కిట్లను అందజేస్తోందన్నారు.
గౌడ విద్యార్థుల కోసం స్థలం కేటాయించి హాస్టల్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వీరి వెంట మాజీమంత్రి రాజేశంగౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్‌కుమార్, మేడిపల్లి సత్యం, కేయూడీఏ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్ ఉన్నారు.