హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై..కేంద్ర ప్రభుత్వం స్పందించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై..కేంద్ర ప్రభుత్వం స్పందించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • వెంటనే దౌత్యపరమైన చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్​ట్రంప్.. హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​డిమాండ్​చేశారు. ట్రంప్ నిర్ణయంతో భారత ఐటీ నిపుణులపై, ముఖ్యంగా తెలంగాణ యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 ఈ విషయంలో భారత ప్రభుత్వం తక్షణమే దౌత్యపరమైన చర్యలు చేపట్టి, మన వారి ప్రయోజనాలను కాపాడాలని ఆయన పేర్కొన్నారు. ‘‘భారత్ -– అమెరికా మధ్య బలమైన సంబంధాలకు పునాది ప్రతిభ, సాంకేతికత మార్పిడి. అలాంటిది వీసా ఫీజులను ఇంత భారీగా పెంచడం ఆమోదయోగ్యం కాదు. ఈ నిర్ణయం మన యువతలో, అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీలలో తీవ్ర అనిశ్చితికి దారితీస్తుంది" అని మంత్రి పేర్కొన్నారు. 

హైదరాబాద్ కేంద్రంగా వేలాది మంది ఐటీ నిపుణులు అమెరికాలో ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, ఈ నిర్ణయం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుందని అన్నారు. దీని వల్ల కలిగే ఆర్థిక, వాణిజ్యపరమైన దుష్పరిణామాలను అమెరికా ప్రభుత్వానికి వివరించేందుకు ఐటీ కంపెనీలు, పరిశ్రమల సంఘాలు, ఎన్నారై నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ లు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఈ నిర్ణయంతో ఇబ్బందులు ఎదుర్కొనే ఐటీ నిపుణులకు, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర యువత ప్రతిభకు ఎలాంటి నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి, వారి హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.