
కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీని రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండేలా విద్యార్థులు, లెక్చరర్లు కష్టపడాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శాతవాహన యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో ఆధునీకరించిన సెమినార్ హాల్ ను శనివారం మంత్రి ప్రారంభించారు. రూ.2.10 కోట్లతో చేపట్టిన అంతర్గత నీటి సరఫరా పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సెమినార్ హాల్ నిర్వహించిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్సార్ సహకారంతో 200 ఎకరాలు సేకరించి శాతవాహన యూనివర్సిటీని ప్రారంభించామని, తాను ఎంపీగా ఉన్నప్పుడే ప్రహరీ నిర్మించామని, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.
మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజీ, కరీంనగర్ క్యాంపస్ లో లా కాలేజీ, ఫార్మసీ కాలేజీలో ఎం.ఫార్మసీ కోర్సును మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మార్చి లోపు మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసి లక్ష ఉద్యోగాలిస్తామన్నారు. శాతవాహన విగ్రహాన్ని క్యాంపస్ ఆవిష్కరించుకుందామని, శాతవాహన ఉత్సవాలు కరీంనగర్ లో ఘనంగా జరుపుకుందామని తెలిపారు.
యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ నిరుడు డిసెంబర్ 4 న సీఎం పెద్దపల్లి వచ్చినప్పుడు లా, ఇంజనీరింగ్ కాలేజీలు ఇస్తామమని హామీ ఇచ్చారని, హామీ ఇచ్చినట్లే మంత్రి పొన్నం సహకారంతో ఆర్నెళ్లలో కాలేజీలు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో రూ.18 కోట్లతో లా కాలేజీ నిర్మిస్తామని వెల్లడించారు.ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జాస్తీ రవికుమార్, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత, డాక్టర్ హరికాంత్, డాక్టర్ సురేశ్ కుమార్ లెక్చరర్లు పాల్గొన్నారు.