ఆర్టీసీని బలితీసుకున్నోళ్లే మొసలి కన్నీరు కారుస్తున్నరు : మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీని బలితీసుకున్నోళ్లే మొసలి కన్నీరు కారుస్తున్నరు : మంత్రి పొన్నం ప్రభాకర్
  •     ప్రయాణికుల ఇబ్బందులు తొలగించినం: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉండి ఆర్టీసీని బలితీసుకున్నోళ్లే ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. గాంధీ భవన్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ గురువారం బస్ భవన్ కు పిలుపునివ్వడంపై మండిపడ్డారు. ‘‘ప్రయాణికులకు ఇబ్బందులు తొలగించేందుకే టికెట్ ల సవరణ చేశాం. 2,800 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నాం. వాటి చార్జింగ్ స్టేషన్లకు హై టెన్షన్ లైన్ కోసం ఫేర్ ల సవరణ చేశాం. 

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా కూడా చార్జీ పెంచలేదు. ఆర్టీసీ గ్రీన్ ఫీ పేరుతో స్వల్పంగా చార్జీలను సవరిస్తే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తున్నది. గత పదేండ్లు ఆర్టీసీని నాశనం చేశారు. ఒక్క బస్సు కొనలేదు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. రిటైర్డ్ అయిన ఈడీని నియమించి ఆర్టీసీ వ్యవస్థను ధ్వంసం చేశారు’’అని మంత్రి పొన్నం మండిపడ్డారు. 2019ఈలో ఆర్టీసీ కార్మికులు 55 రోజుల పాటు సమ్మె చేస్తే వారిపై ఉక్కుపాదం మోపారని విమర్శించారు. 

‘‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సార్లు చార్జీలు పెంచింది. ఇప్పుడేమో వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నది. ఆర్టీసీ సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు పోతున్నం. ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. రూ.110 కోట్లు కేటాయించి బస్టాండ్​లను పునరుద్ధరిస్తున్నాం. రెండేండ్లుగా కార్గో సేవల ద్వారా ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల్లోకి వస్తున్నది. ఈ సమయంలో ఆర్టీసీని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ బస్ భవన్ పేరుతో రాజకీయ కుట్ర చేస్తున్నది’’అని పొన్నం మండిపడ్డారు.