ఆవేశంగా మాట్లాడకు.. మాట్లాడాలనుకున్నది మరచిపోతావ్

ఆవేశంగా మాట్లాడకు.. మాట్లాడాలనుకున్నది మరచిపోతావ్

‘ఆలోచనతో మాట్లాడు.. ఆవేశంగా మాట్లాడకు. ఆవేశంగా మాట్లాడితే.. మాట్లాడాలనుకున్నది మరచిపోతావు. మళ్ళీ ఏదో ఏదో మాట్లాడుతావ్’ అని రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ.. మంత్రి ప్రశాంత్ రెడ్డి పైవ్యాఖ్యలు చేశారు.

కాగా.. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. తమ నియోజకవర్గ ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఫార్మా ఇండస్ట్రీల వల్ల గాలి, నీరు కాలుష్యం అవుతుందని ఆయన మండిపడ్డారు. ‘స్థానికంగా ఉన్న పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు లేవు.  స్థానిక పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి. పంచాయతీ రాజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకుండా పనులు చేయమని సర్పంచ్‌లను ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది తట్టుకోలేక కొంత మంది సర్పంచ్‌లు చనిపోయారు. ప్రభుత్వం ఆలోచన బాగుంది కానీ సర్పంచ్‌లకు డబ్బులు ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్‌లు, రేషన్ కార్డులు ఇవ్వక సంవత్సరం దాటింది. తండాలను గ్రామ పంచాయతీలు చేశారు కానీ, గ్రామ పంచాయతీ కార్యాలయాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. గ్రామ పంచాయతీలు లేవు కానీ రైతు వేదికలు కడుతున్నారు. గ్రామ పంచాయతీలు కట్టిన తరువాత రైతు వేదికలు కట్టండి, మాకు ఇబ్బంది ఏంలేదు. మా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉంది. ప్రతిపక్షంలో ఉండడం పాపమా? మేము గతంలో అడిగిన పనులు ఒక్కటి కూడా చేయడం లేదు. ప్రజలకు బాధ అనిపిస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు కలుస్తున్నారు? ఎవరితో చెప్పాలి? బడ్జెట్‌లో అలోకేషన్ చేసిన డబ్బులను కూడా ఖర్చు చేయడం లేదు’ అని ఆయన అన్నారు.