ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని ముందు నుంచీ డిమాండ్‌ చేస్తున్నం

ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని ముందు నుంచీ డిమాండ్‌ చేస్తున్నం
  • భద్రాచలం మునిగింది పోలవరంతోనే మంత్రి పువ్వాడ అజయ్‌
  • ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని ముందు నుంచీ డిమాండ్‌ చేస్తున్నం
  • భద్రాచలం వద్ద కరకట్టలు కట్టేందుకు 
  • ఐదు గ్రామాలు తెలంగాణకియ్యాలె

హైదరాబాద్‌, వెలుగు:  పోలవరం ప్రాజెక్టుతోనే భద్రాచలం మునిగిందని, ఆ ప్రాజెక్టు నుంచి ఆలస్యంగా నీళ్లు విడుదల చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని మంత్రి పువ్వాడ అజయ్‌ ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గించాలని తాము మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రాచలం వద్ద కరకట్టలు కట్టినా అవి పటిష్టంగా లేవని చెప్పారు. పోలవరం ముంపు పేరుతో ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని, అక్కడ వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. 

వాళ్లు తెలంగాణ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని చెప్పారు. ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని, ఈ పార్లమెంట్‌‌‌‌ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు పెట్టాలని తమ పార్టీ ఎంపీలు కోరుతున్నారని తెలిపారు. పోలవరం డిజైన్‌‌‌‌ మార్చి మూడు మీటర్ల ఎత్తు పెంచుతున్నారని, ఇది జాతీయ ప్రాజెక్టు అని, ఎగువన ముంపు లేకుండా తగ్గించాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. గోదావరి ముంపు ప్రాంతాల నుంచి 25 వేల మందిని సహాయ శిబిరాలకు తరలించామని, ఇన్ని ఏర్పాట్లు చేసినా మీడియా సౌకర్యాల లేమి అని వార్తలు ప్రచురించడం దురదృష్టకరమన్నారు. వరద బాధితుల అకౌంట్లలో ఒకటి రెండు రోజుల్లో రూ.10 వేలు జమ చేస్తామన్నారు. వరదల్లోనూ కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు. పోలవరం బ్యాక్‌‌‌‌ సమస్యపై స్టడీ చేయాలని, ఏపీలోనూ యుద్ధ ప్రాతిపదికన కరకట్టలు నిర్మించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు.

ఆవేదనను అర్థం చేసుకోవాలన్న పువ్వాడ

భద్రాచలం ముంపు ప్రాంతాల్లోని వరద బాధితుల ఆవేదనను ఏపీ మంత్రులు అర్థం చేసుకోవాలని మంత్రి అజయ్‌‌‌‌ కోరారు. పోలవరం వల్లే భద్రాచలం ముంపు, 5 గ్రామాలు తిరిగి ఇచ్చేయాలన్న కామెంట్స్‌‌‌‌పై ఏపీ మంత్రులు బొత్స, అంబటి రాంబాబు కౌంటర్‌‌‌‌ ఇవ్వడంతో అజయ్‌‌‌‌ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలంతో పాటు ముంపు ప్రాంతాల్లోకి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. కరకట్టలు నిర్మించేందుకు ఏపీలో విలీనం చేసిన ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరామన్నారు. ఏపీలో ఉన్న ఆ గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం పనులు చేయలేదు కాబట్టే వాటిని తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ 5 ఊర్లకు, హైదరాబాద్‌‌‌‌కు లింక్‌‌‌‌ పెట్టడం అర్థరహితమన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల కోసమే తాను మాట్లాడానని, వాటిని వక్రీకరించి విమర్శించడం సరికాదని, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామని అన్నారు.

ప్రజలను రెచ్చగొట్టొద్దు 

మంత్రి  పువ్వాడ అజయ్‌ బాధ్యతగా మాట్లాడాలి. ప్రజలను రెచ్చగొట్టొద్దు.  సీడబ్ల్యూసీ అనుమతించిన డిజైన్ల ప్రకారమే పోలవరం నిర్మిస్తున్నం.విలీన మండలాలు తెలంగాణలో కలిపేయాలని వాళ్లు అంటే.. రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలని మేం డిమాండ్‌ చేస్తం.   రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ నుంచి ఏపీకి రావాల్సిన ఆదాయం పోయింది. గతంలో మాదిరి ఉమ్మడి రాష్ట్రం ఉంచాలని మేం అడిగితే బాగుంటుందా.

‑ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ