మిషన్ భగీరథతో తీరిన మంచి నీళ్ల గోస

మిషన్ భగీరథతో తీరిన మంచి నీళ్ల గోస

ఖమ్మం: ఒకప్పుడు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం నానా తంటాలు పడేవారని, కానీ కేసీఆర్ దయ వల్ల మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి మంచి నీళ్లు వస్తున్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలో  మంత్రి కేటీఆర్ తో కలిసి పువ్వాడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.  ల‌కారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన‌, మ్యూజిక‌ల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌, ప్రకృతి వ‌నాన్ని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ మాట్లాడుతూ... కేసీఆర్ హయాంలో  రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తూ... దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, దళిత బంధు... ఇలా ఎన్నో గొప్ప పథకాలు దేశంలో ఎక్కడాలేని విధంగా ఇవాళ రాష్ర్టంలో అమలవుతున్నాయని తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు నీరుకు కొదవలేదని, పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్దిదారులకు త్వరలోనే అందిస్తామని చెప్పారు. కేటీఆర్ వల్ల రాష్ట్ర ఐటీ రంగం దూసుకుపోతోందని, దావోస్ పర్యటనతో రూ.1000 కోట్ల పెట్టబడులు తీసుకొచ్చారని కేటీఆర్ ను పొగిడారు. ఐటీ హబ్ ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.