స్టూడెంట్ల డిమాండ్లు సిల్లీగా ఉన్నయ్

స్టూడెంట్ల డిమాండ్లు సిల్లీగా ఉన్నయ్

ఇన్​చార్జీ వీసీ, కాంట్రాక్టు లెక్చరర్లుంటే వాళ్లకేం సమస్య: సబిత

హైదరాబాద్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రిప్రజెంటేషన్​లో పెట్టిన డిమాండ్లన్నీ సిల్లీగా ఉన్నాయనీ, వాటిని మీడియా ముందు చదివితే ఇబ్బందికరంగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. వారు పెట్టిన 12 డిమాండ్లే కాదు, ఇంక ఎన్ని సమస్యలున్నా అవన్నీ పరిష్కరిస్తామనీ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులు ఆందోళన మాని క్లాసులకు అటెండ్ కావాలని సూచించారు. బుధవారం మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, మహమూద్ అలీ, విద్యాశాఖ అధికారులతో కలిసి ఆమె సమీక్ష చేశారు. వర్సిటీలో సమస్యలు పరిష్కరించేందుకు స్టూడెంట్ గవర్నింగ్ బాడీ ఉందనీ, ఆ కమిటీ స్థానికంగా ఉండే మంత్రి, ఎమ్మెల్యే, ఇన్​చార్జీ వీసీ దృష్టికి సమస్యలు తీసుకుపోవాలని సూచించారు. వర్సిటీలో ఇన్​చార్జీ వీసీ, కాంట్రాక్టు లెక్చరర్లు ఉంటే స్టూడెంట్లకేం సమస్య అని ప్రశ్నించారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని స్టూడెండ్లకు ఏం సంబంధమన్నారు. విద్యార్థులకు అందివ్వాల్సిన యూనిఫామ్స్, ఇతర అవసరాలను తీరుస్తామనీ చెప్పారు. నీరు, ఎలక్ట్రిసిటీ, చిన్నచిన్న రిపేర్లను చేయిస్తామనీ, చిన్న సమస్యలను పెద్ద సమస్యలుగా పేర్కొన్నారని తెలిపారు. కొందరు దీంట్లోనూ రాజకీయాలు చేస్తున్నారనీ, అయితే ఎక్కడ రాజకీయాలు చేయాలో అక్కడే చేద్దామనీ, పిల్లలకు భవిష్యత్​కు ఇబ్బంది కలిగించవద్దని చెప్పారు. వర్సిటీని ప్రశాంతంగా ఉండాలని సూచించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలో సమస్యలను పరిష్కరిస్తామనీ చెప్పారు. జులై మొదటివారంలో సబితాఇంద్రారెడ్డితో కలిసి వర్సిటీ లో పర్యటిస్తామని తెలిపారు. 

త్వరలో ఇన్​చార్జీ డైరెక్టర్ నియామకం

వర్సిటీ ఇన్​చార్జీ డైరెక్టర్​ను ఒకటి, రెండ్రోజుల్లో నియామించాలని సమావేశంలో నిర్ణయించారు. ఓయూ ఇంజినీరింగ్ విభాగంలోని ఓ ప్రొఫెసర్​ను పంపించాలనే చర్చ జరిగింది. సీఎస్ రాగానే కొత్త వీసీ నియామకంపైనా చర్చించాలనీ, సీఎం దృష్టికి వీటిని తీసుకుపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.