రివాల్వర్​తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

రివాల్వర్​తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

పంజాగుట్ట, వెలుగు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ ఎస్​ఐ ఫైజల్ అలీ (54) ఆదివారం ఉదయం సర్వీస్ రివాల్వర్​తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనగర్ కాలనీలోని సబితా ఇంద్రారెడ్డి ఇంటికి కొద్ది దూరంలోనే ఈ ఘటన జరిగింది. పాయింట్ బ్లాంక్​లో కాల్చుకుని ఫైజల్ అలీ ఆత్మహత్య చేసుకున్నట్లు జూబ్లీహిల్స్ ఇన్​స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. హుస్సేనిఆలం కాకానితట్టికి చెందిన ఫైజల్ అలీ.. కానిస్టేబుల్ నుంచి ఏఆర్ ఎస్ఐ ర్యాంక్​కు ఎదిగారు. ఏడాది కాలంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు ఆడపిల్లలు, కొడుకు ఉన్నాడు. ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లు అయ్యాయి. కొడుకు స్థానికంగా షాపు నిర్వహిస్తున్నాడు. 

ఆడ బిడ్డలు ఇద్దరూ భర్తల నుంచి విడాకులు తీసుకున్నారు. ఫైజల్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సర్వీస్ దగ్గరపడటంతో వయస్సు రీత్యా లోన్ ఇచ్చేందుకు బ్యాంకు వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ రవీంద్ర ప్రసాద్ వివరించారు. శనివారం సాయంత్రం మంత్రి ఇంటి వద్ద విధులు నిర్వహించిన ఫైజల్.. రాత్రంతా తోటి సిబ్బందితో బాగానే ఉన్నాడు. 

ఆదివారం తెల్లవారుజామున డ్యూటీ నుంచి రిలీవ్ అయ్యాడు. ఆరు గంటలకు సబితా ఇంద్రారెడ్డి ఇంటి నుంచి బయలుదేరాడు. స్కూటర్​పై వచ్చిన ఆయన.. స్థానికంగా ఉన్న మణికంఠ హోటల్ దగ్గర్లో తన కూతురుతో మాట్లాడాడు. బ్యాంక్ లోన్ గురించి ఇద్దరూ చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్ తీసుకుని నుదుటిపై కాల్చుకున్నాడు. దీంతో స్పాట్​లోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ కూడా స్పాట్​కు చేరుకుని ఫైజల్ కూతురుతో మాట్లాడారు. 

తర్వాత డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. హోటల్ నిర్వాహకుడు సాయి మాట్లాడుతూ...‘‘ఫైజల్ సార్ మాకు రెగ్యులర్ కస్టమర్. తరుచూ ఇక్కడికి జీరాక్స్, టీ కోసం వచ్చేవాళ్లు. ఆదివారం కావడంతో మా షాప్ తెర్వలేదు. షాప్ దగ్గరే నా ఇల్లు ఉంది. కాల్పుల శబ్దం విని బయటికి వచ్చాను. అప్పటికే ఫైజల్ సార్ కింద పడి ఉన్నారు’’అని సాయి తెలిపాడు.