ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం..సమస్యలు పంచుకోండి పరిష్కరిస్తాం

ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం..సమస్యలు పంచుకోండి పరిష్కరిస్తాం

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మొన్న(జూన్ 13) విద్యార్థిని దీపిక మృతిపై కమిటీ వేశామని.. విచారణ కొనసాగుతుందని మంత్రి చెప్పారు. ఈరోజు(జూన్ 15) జరిగిన విద్యార్థిని లిఖిత ఆత్మహత్య ఘటనపై ఇంకా పూర్తి సమాచారం అందలేదని తెలిపారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత సమావేశం జరిపి అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. విద్యార్థులు సమన్వయం పాటించి ఆత్మహత్యలకు పాల్పడద్దని ఆమె కోరారు. 

ట్రిపుల్ ఐటీ లో  సమస్యలు ఉంటే వాటిని తోటి విద్యార్థులతో పంచుకొని.. సమస్యలు పరిష్కరించుకునే విధంగా ప్రయత్నం చేయాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కానీ ఇలా ఆత్మహత్యలతో తల్లిదండ్రులను, తోటి మిత్రులను శోక సముద్రంలోకి తీసుకెళ్లద్దని కోరారు. ట్రిపుల్ ఐటీలో జరిగిన ఘటనపై విచారణ కమిటీని నియమించామని వెల్లడించారు. ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

వికారాబాద్ పట్టణంలో ఒక కోటి 70 లక్షలతో నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ భవనాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రం సాధించిన తర్వాత ప్రతి రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి జిల్లాలో లైబ్రరీలకు కొత్త భవనాలను నిర్మించి.. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు.