
- పదేండ్ల అధికారంలో ప్రజలనుకేసీఆర్ నిండా ముంచారు
- నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల నేతలతో సమావేశం
నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పినా.. ఇంకా డ్రామాలు ఆపలేదని మంత్రి సీతక్క అన్నారు. పదేండ్ల అధికారంలో ప్రజలను కేసీఆర్ అడుగడుగునా మోసం చేశారన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం, ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవంతో బతకడానికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్.. తన ఇంట్లో వారికి జాబ్స్ ఇచ్చుకున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వం 30 వేల డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లకు బిల్స్ ఎగొట్టగా.. సీఎం రేవంత్ రెడ్డి వాటిని క్లియర్ చేశారన్నారు. మూడేండ్లకే పడిపోయిన కూలేశ్వరం నిర్మించి భూజాలు ఎగరేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ సర్కార్ హయాంలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా సాగునీరు అందలేదని, ఏదైనా ఉంటే ఆయన ఫామ్ హౌస్‌కే లాభం చేసుకొని ఉంటారని ఆరోపించారు. వరి వేసుకుంటే ఉరేనని రైతులను కేసీఆర్ భయపెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులకు భరోసా ఇచ్చి సన్నవడ్ల సాగును పెంచిందన్నారు.
ఏడాదిన్నర సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.21 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిందని గుర్తుచేశారు. మార్కెట్‌లో కిలో రూ.50 పలికే సన్నబియ్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌తో తండాలు, గూడేలు, పేదలకు మేలు చేశారన్నారు. ప్రతి సెగ్మెంట్‌కు 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, మహిళా సంఘాలతో పునాది నిర్మాణానికి రుణం ఇప్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి గ్రూప్ లీడర్లు వద్దని, గుడ్ లీడర్లు కావాలన్నారు. రాష్ట్రంలో కార్యకర్తల ఎన్నికలు వచ్చాయని, లోక్‌బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా పనిచేయాలని
ఆమె పిలుపునిచ్చారు.