- బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందన్న బోథ్ ఎమ్మెల్యే
- అటవీ హక్కులు, లంబాడీలకు క్యాస్ట్ సర్టిఫికేట్ల జారీపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా బుధవారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేసిన ఆరోపణలను మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల ప్రయోజనాలను కాపాడే జీవో 3ని రద్దు చేసిందని, దానిని వెంటనే రీ-ఇంప్లిమెంట్ చేయాలని అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే జీవో 3 బీఆర్ఎస్ హయాంలోనే రద్దయిందని గుర్తుచేశారు.
తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించొద్దని అనిల్ జాదవ్‌కు సూచించారు. కాంగ్రెస్ హయాంలోనే ఆర్ఓఎఫ్ఆర్ చట్టం తెచ్చామని, గిరిజన అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఐదు కొత్త ఐటీడీఏల ఏర్పాటు గురించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ.. ఐటీడీఏలను నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వమేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
స్థానిక లంబాడీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు: మంత్రి అడ్లూరి
ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అలాగే, సిద్దగూడలో ఫారెస్టు అధికారులు పెద్ద గోతులు తీసి.. పరిధులు నిర్ణయిస్తూ గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ దృష్టికి తీసుకొచ్చారు. అనిల్ జాదవ్ వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో వలస వచ్చే వారి విషయంలోనే నిబంధనలు కఠినంగా ఉన్నాయన్నారు. స్థానికంగా స్థిర నివాసం ఉంటున్న లంబాడీలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంచేశారు.
ఇదే విషయంపై జిల్లా కలెక్టర్‌తో కూడా మాట్లాడానని, ఈ విషయం ఎమ్మేల్యేకు కూడా తెలుసని వెల్లడించారు. కేవలం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికే ఎమ్మెల్యే ఇలా మాట్లాడుతున్నారని కొట్టిపారేశారు. అలాగే.. సిద్దగూడలో రిజర్వ్ ఫారెస్ట్‌లో టైగర్ రిజర్వ్ పరిధి కాబట్టి దానికి సంబంధించి కందకాలు తవ్వారని, దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి అడ్లూరి క్లారిటీ ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ నిధుల్లో కోత: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
అంతకుముందు బడ్జెట్ పై మాట్లాడిన అనిల్ జాదవ్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ నిధుల్లో 70 శాతం కోత పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ దళిత బంధు పేరుతో రూ.10 లక్షలు ఇస్తే, కాంగ్రెస్ రూ.12 లక్షలు ఇస్తామని చేవెళ్ల డిక్లరేషన్ లో చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. ఆదిలాబాద్ లో లంబాడీలను క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం 1950 నాటి ఆధారాలు అడగడం ఏంటని, భూములు లేని పేదలు ఆధారాలు ఎక్కడి నుంచి తెస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
పట్టాలున్నప్పటికీ... ఫారెస్టు అధికారులు గిరిజనులకను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రోడ్లు వేసుకోనీకుండా, కరెంట్ రాకుండా, బోర్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. అలాగే, కొత్తగా ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏ స్కూళ్లలో టీచర్ల కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.
