మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తం

మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తం
  • తొలిసారి రూ.150 కోట్లు రిలీజ్ చేశాం: మంత్రి సీతక్క
  •     డబుల్ రోడ్లు, డివైడర్లు డెవలప్ చేస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం ఎన్నడు లేని విధంగా ఈ దఫా రూ.150 కోట్లు విడుదల చేసిన్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. గురువారం సెక్రటేరియెట్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. మేడారం సమ్మక్క,- సారలమ్మ జాతర వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్ల నిధులు విడుదల చేసిందని చెప్పారు. జాతర కోసం శాశ్వత పనులు చేపడుతున్నామని, జంపన్న వాగు నుంచి మేడారం ప్రాంగణం వరకు డబుల్ రోడ్లు, రోడ్ల వెడల్పు, డివైడర్లు, 29 ఎకరాల దేవాదాయ శాఖ భూమిలో స్మృతివనం అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, భద్రత కోసం 12 వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించనున్నట్టు మంత్రి సీతక్క వెల్లడించారు. 

 జాతరకు గతేడాది కంటే ఎక్కువ నిధులు

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..సమ్మక్క - సారలమ్మ గత జాతరకు 105 కోట్లు కేటాయిస్తే... ఈ సారి 150 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఆదివాసీ పూజారులు కోరిన విధంగా జాతర పనులు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.