మహిళా సంఘాలకు రూ.10 లక్షల వ‌‌డ్డీలేని రుణం: మంత్రి సీతక్క

మహిళా సంఘాలకు రూ.10 లక్షల వ‌‌డ్డీలేని రుణం: మంత్రి సీతక్క
  •     ఇప్పటి రూ.5 లక్షల పరిమితి రెట్టింపు 
  •     ఈ ఏడాది వడ్డీలకే రూ.2,500 కోట్లు ఖర్చు: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాల పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న రూ.5 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. గురువారం జ్యోతిబాపూలే ప్రజాభవన్‌‌లో నిర్వహించిన మహిళా సంఘాల వార్షిక రుణ ప్రణాళిక (2026-–27) ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 

మహిళా సంఘాలు తీసుకునే రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 2026-–27 ఆర్థిక సంవత్సరానికి మహిళా సంఘాలకు రూ.26,621.47 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గత రెండేళ్లలో రూ.40 వేల కోట్ల లక్ష్యం పెట్టుకోగా, బ్యాంకర్ల సహకారంతో రూ.60 వేల కోట్ల రుణాలు ఇచ్చి రికార్డు సృష్టించామని పేర్కొన్నారు. 

వడ్డీ వ్యాపారుల దోపిడీని చూడలేకే ఒకప్పుడు తాను నక్సలైట్లలో చేరానని, ఇప్పుడు అదే వడ్డీ వ్యాపారుల కోరల నుంచి మహిళలను రక్షించేందుకు బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామని మంత్రి అన్నారు. మహిళలకు రుణాలు ఇస్తే ఆ డబ్బుకు పూర్తి భరోసా ఉంటుందని, ఎస్‌‌హెచ్‌‌జీల ఎన్‌‌పీఏ కేవలం 1.40 శాతంగా ఉండటం దీనికి నిదర్శనమని తెలిపారు. జీరో ఎన్‌‌పీఏ సాధించిన నిర్మల్ జిల్లా డీఆర్‌‌డీఓ విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు గంగవ్వను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. రుణ పరిమితి పెంపుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

అంగన్‌‌వాడీ ఫుడ్‌‌లో క్వాలిటీ లోపిస్తే కఠిన చర్యలు: మంత్రి సీతక్క

అంగన్‌‌వాడీ సెంటర్ల ద్వారా చిన్నారులు, గర్భిణులకు అందే ఆహార పదార్థాల్లో నాణ్యత తగ్గితే సహించేది లేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌‌ నాచారంలోని టీజీ ఫుడ్స్‌‌ను సందర్శించిన ఆమె, అక్కడ కొత్తగా నిర్మించనున్న క్యాంటీన్, గోదాములకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్‌‌వాడీలకు సరఫరా చేస్తున్న బాలామృతం పక్కదారి పట్టకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.

హైదరాబాద్‌‌లోని కొన్ని సెంటర్లలో చిన్న కోడిగుడ్లు సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, అంగన్‌‌వాడీల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని, ఇందుకు సంబంధించిన ఫైల్‌‌పై తాను సంతకం కూడా చేశానని తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరిన విధంగా నియోజకవర్గంలో కొత్త అంగన్‌‌వాడీ కేంద్రాలను మంజూరు చేస్తామని మంత్రి హామీఇచ్చారు.