- అన్ని పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం
ములుగు/తాడ్వాయి, వెలుగు : భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మేడారంలో అభివృద్ధి, గద్దెల పునఃనిర్మాణ పనులు చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో కలిసి ఆదివారం మంత్రి మేడారంలో పర్యటించారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని, గద్దెల చుట్టూ కొత్తగా ప్రహరీ నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మేడారం మహాజాతరను సక్సెస్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. వనదేవతల కీర్తి, ప్రతిష్టలను, ప్రపంచ నలుమూలలకు తెలిసేలా ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. జంపన్న వాగు వద్ద మెట్లను క్లీన్‌గా ఉంచాలని సూచించారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారంలో ఒక్కసారైనా పరిశీలించి సంబంధిత ఆఫీసర్లకు సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా.. మహా జాతర టైంలో హనుమకొండ నుంచి తాడ్వాయి మండల కేంద్రం వరకు పలు వ్యాపారాలు నిర్వహించుకోవడానికి మహిళలకు అవకాశం కల్పించడంతో పాటు, ఆర్థికసాయం చేసేందుకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆమె వెంట పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఎండోమెంట్ ఈవో వీరస్వామి ఉన్నారు. అంతకుముందు ములుగు సమీపంలో గట్టమ్మను దర్శించుకొని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గట్టమ్మ ప్రధాన పూజారి కొత్త సదయ్య, డీఎస్పీ రవీందర్ ఉన్నారు.
