
హైదరాబాద్, వెలుగు : ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. అందుకే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. అన్ని శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నామని, పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. పలువురు అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, గిరిజన స్కూల్స్ టీచర్లు బుధవారం బుధవారం సెక్రటేరియట్‌లో మంత్రి సీతక్కను కలిసి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాం.. ఉద్యోగులకు ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందాం. డెడ్‌లైన్లు పెట్టొద్దు. అందరం కలిసి పనిచేస్తేనే ప్రభుత్వ స్కీమ్‌లు క్షేత్ర స్థాయి వరకు అమలవుతాయి’ అని సీతక్క చెప్పారు.
మంత్రిని సన్మానించిన ఐఎన్టీయూసీ నేతలు
ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బందికి జీతాలను విడుదల చేయించిన మంత్రి సీతక్కను ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు నాగన్న నేతృత్వంలో పలువురు సన్మానించారు. అంగన్ వాడీ సిబ్బందికి సెలవులు మంజూరు చేసినందుకు, మినీ అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించినందుకు టీచర్లు, హెల్పర్లు కూడా సన్మానం చేశారు.