
- మంత్రి సీతక్క
కామారెడ్డి, వెలుగు:రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం మాచారెడ్డి, పాల్వంచ మండల కేంద్రాల్లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. బీసీలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. కామారెడ్డిలో ఈ నెల 15న జరగాల్సిన బీసీ సభను వర్షాల వల్ల వాయిదా వేసినట్లు తెలిపారు.
సభ కొత్త తేదీ ఖరారు కాగానే విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఎరువుల సమస్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమని, సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేశ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, పీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింగ్ రావు, పాల్వంచ మండలాధ్యక్షుడు రమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి
పాల్వంచ మండలంలో మెయిన్ రోడ్డు నుంచి మంథని–దేవునిపల్లి వరకు వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్డు పునర్నిర్మాణం చేపడుతున్నారు. శుక్రవారం మంత్రి సీతక్క పనులను పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.