
- మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
- అంగన్‌వాడీ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే
మనోహరాబాద్, వెలుగు : చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగిన ప్రీప్రైమరీ యాన్యువల్ డే, గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. టెక్ ఎఫ్ఎంసీ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్ వాడీ స్టూడెంట్లకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం ఇప్పటికే 57 రకాల ఆట వస్తువులు, గర్భిణుల కోసం బెంచీలు ఏర్పాటు చేశామని, వారికి అవసరమైన పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. చిన్నారుల ఎదుగుదలకు దోహదపడే పోషకాహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో బాలామృతం తయారుచేయిస్తున్నామన్నారు.
అంగన్‌వాడీ పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్య అందిస్తున్నామన్నారు. అంగన్‌వాడీ టీచర్స్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజులు సెలవులు మంజూరు చేశామని, వారి డిమాండ్లను నెరవేర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. అంగన్‌వాడీ సెంటర్స్‌ను ప్రీప్రైమరీ స్కూల్స్‌గా మార్చాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఐసీడీఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, టెక్ ఎఫ్ఎంసీ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జేడీ విశాలాక్షి, డీడబ్ల్యూవో హైమావతి పాల్గొన్నారు.