
- రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోమనడానికి నోరెట్లా వచ్చింది?
- మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు : బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన కేటీఆర్ వెంటనే మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి సీతక్క ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘ఆ పదం నీ నోటికి ఎలా వచ్చింది కేటీఆర్. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడుతున్నది. మీకు పదేండ్లు ఆలోచన రాలేదు. మేం ఉచిత బస్సు స్కీం పెట్టినందుకు అందులో ప్రయాణించే మహిళలను అవమానించేలా మాట్లాడుతున్నరు. మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి, తప్పుడు ప్రచారాలు చేస్తున్నరు. బస్సుల్లో ప్రయాణించే మహిళలే తప్పుడు మనుషులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నరు.
కుటుంబాలకు, కుటుంబాలు వెళ్లి రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అంటూ కించపరుస్తున్నరు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రి మీకు మహిళల పట్ల నేర్పిన గౌరవం? మీ ఇంట్లో కూడా ఆడపడుచు ఉంది కదా? మీ ఇంట్లో మహిళలు కూడా బస్సులు ఎక్కినప్పుడు బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారా? ” అని కేటీఆర్‌ను సీతక్క ప్రశ్నించారు. ఇలాంటి మాటలు తగవని, వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పదేండ్లు పబ్బులు, క్లబ్బుల సంస్కృతిని ప్రోత్సహించిన కేటీఆర్.. ఇంకా అదే ధ్యాసలో ఉన్నారని సీతక్క ఎద్దేవా చేశారు.
సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్
కేటీఆర్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు యావత్ తెలంగాణ మహిళలను అవమానించేలా, బాధించేలా, నిరుత్సాహానికి గురిచేసేలా ఉన్నాయని, దీనిపై తాము విచారణ ప్రారంభించామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ప్రకటించారు. కేటీఆర్ తన పద్ధతి మార్చుకోవాలని మహిళా కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు.
ఇలాగే మరోసారి మహిళలను కించపర్చేలా మాట్లాడితే కేటీఆర్‌కు చీపురు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమె ప్రకటన విడుదల చేశారు. అధికారం కోల్పోయాక కేటీఆర్ మెదడు మోకాళ్లకు చేరినట్టుందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ మండిపడ్డారు. తన పబ్బులు, క్లబ్బుల కల్చర్‌ను మహిళలపై రుద్దుతూ, ఆయన మహిళలను అవమానిస్తున్నాడని దుయ్యబట్టారు.