సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
  • పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
  • జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 

కామారెడ్డి, కామారెడ్డిటౌన్, వెలుగు : సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం జిల్లా  కేంద్రంతో పాటు, భిక్కనూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  కామారెడ్డిలో  రూ. 8 కోట్లతో చేపట్టనున్న ఇండోర్ స్టేడియం,   రూ. 9 కోట్లతో  సీసీ రోడ్లు,  బీటీ రోడ్లు, డ్రైనేజీ పనులు, మార్కెట్ యార్డులో  రూ. 51 లక్షలతో కాంపౌండ్​వాల్, టాయిలెట్లు, ఇతర పనులకు శంకుస్థాపన,  రూ. 96 లక్షలతో నిర్మించిన  వృద్ధాశ్రమాన్ని  ప్రారంభించారు. 

భిక్కనూరు మార్కెట్ యార్డులో రూ. 92 లక్షలతో చేపట్టే పనులకు శంకుస్థాపన, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో గ్రంథాలయ వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడుతూ లైబ్రరీలు విజ్ఞాన గనులని,  పుస్తకాల రీడింగ్​తో వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక చైతన్యం వస్తుందన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.  రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.  మహిళల ధైర్యం, నాయకత్వం, పట్టుదల  దేశాభివృద్ధికి కీలకమన్నారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితో ప్రతి మహిళ ముందుకు సాగాలన్నారు.

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్​ ఎంపీ సురేశ్​షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్,  ఎస్పీ రాజేశ్​చంద్ర, అడిషనల్ కలెక్టర్ విక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ,  జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి,  మార్కెట్​ కమిటీ చైర్మన్లు  రాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.   

రాధాకృష్ణానగర్​ అభివృద్ధికి కృషి చేస్తా  

సదాశివనగర్ : కామారెడ్డి పట్టణంలోని అశోక్​ నగర్​ పరిధిలోని రాధాకృష్ణానగర్  అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి సీతక్క అన్నారు. గురువారం షబ్బీర్​ అలీ, ఎంపీ సురేశ్​ షెట్కార్​ తో కలిసి కాలనీలో పర్యటించారు. 
కాలనీ మహిళలు మంత్రిని సన్మానించారు. మంత్రి పర్యటన సందర్భంగా రామారెడ్డి గ్రామ రైతులు వరి ధాన్యానికి బోనస్​ ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సిద్దరాంరెడ్డి, యాడరం రమేశ్​ చారి, రాజగౌడ్​, వెంకట్​ రెడ్డి, మచ్చిందర్ పాల్గొన్నారు.