సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం : మంత్రి సీతక్క

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం : మంత్రి సీతక్క
  • పౌష్టికాహార ప్రాధాన్యంపై నెల రోజులు అవగాహన కార్యక్రమాలు: మంత్రి సీతక్క
  • మాసూమ్ సమిట్10వ వార్షికోత్సవానికి హాజరు

హైదరాబాద్, వెలుగు: చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ఈ నెల17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోషణ మాసం నిర్వహించనున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పౌష్టికాహారం ప్రాధాన్యంపై నెలరోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. పిల్లల్లో పౌష్టికాహారం పెంపొందించేందుకు పరిశోధనలు జరిపి అంగన్ వాడీ మెనూలో మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌లోని హోటల్ పార్క్ ప్రాంగణంలో సీఐఐ, యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసూమ్ సమిట్10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారుల భద్రత, మహిళల రక్షణ, పోషకాహారం, మహిళా సాధికారత వంటి కీలక అంశాలపై ప్రసంగించారు. చిన్నారుల రక్షణను తమ ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని వివరించారు. చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతున్నామని వెల్లడించారు. హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌లు, కౌన్సెలింగ్, ప్రత్యేక బృందాల ద్వారా బాధిత చిన్నారులకు అండగా నిలుస్తున్నామని, పాఠశాలల్లో అమ్మాయిలకు స్వీయ రక్షణ శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. 

మహిళా భద్రత కోసం త్వరలో పాలసీ...

ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులు పాల్గొనే మహిళా సదస్సు నిర్వహిస్తున్నామని, వారి అభిప్రాయాల ఆధారంగా కొత్త మహిళా భద్రతా పాలసీ తీసుకురాబోతున్నామని మంత్రి సీతక్క  ప్రకటించారు. లైంగిక నేరాల నియంత్రణలో కేవలం శిక్షలకే పరిమితం కాకుండా శిక్షణా కార్యక్రమాలు కూడా ఉండాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.“ఆడవారిని గౌరవించాలని తరగతి గదిలోనే నేర్పాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై ఇండ్లు, పాఠశాలలు, గ్రామాల్లో తప్పనిసరిగా చర్చ జరగాలి. తప్పు జరిగితే పిల్లలు ధైర్యంగా మాట్లాడే వాతావరణాన్ని కల్పించాలి” అని సూచించారు.