గొత్తికోయగూడేలకు సోలార్‌‌ వెలుగులు

గొత్తికోయగూడేలకు సోలార్‌‌ వెలుగులు
  • అడవికి హాని చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు
  • మంత్రి సీతక్క

ములుగు/ఏటూరునాగారం/మంగపేట/భూపాలపల్లి, వెలుగు : గొత్తికోయగూడేలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతీ గూడేనికి సోలార్‌‌ విద్యుత్‌‌ అందిస్తామని, బోర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క  చెప్పారు. అడవికి హానీ కలిగించే వారిపై కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరించారు. ములుగు జిల్లాలోని ములుగు, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలాల్లో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నీటి శుద్ధి కేంద్రం, ఉచిత వైద్య శిబిరాలు, డెయిరీఫామ్‌‌ను ప్రారంభించి, మహిళలకు కుట్టుమిషన్లు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. అడవుల్లో నివసించేవారికి, నిరుపేదలకు సాయం అందించేందుకు పలువురు ముందుకురావడం అభినందనీయం అన్నారు.

గొత్తికోయలకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యుత్‌‌ సరఫరా లేని మారుమూల గ్రామాల్లో సోలార్‌‌ వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. మహిళల ఆర్థిక అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మహిళలు ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని దృఢసంకల్పంతో ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఐక్యతతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బులుండాలని, ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరిటే అమలు చేస్తోందని చెప్పారు. తెలంగాణలోని మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ. 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 

రాష్ట్రంలోని ప్రతి మహిళ మహిళా సంఘంలో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. కష్టాలు, కన్నీళ్లు శాశ్వతం కాదని, మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో కలెక్టర్‌‌ దివాకర, ఎస్పీ రాంనాథ్‌‌ కేకన్‌‌, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, గ్రంథాలయ, మార్కెట్‌‌ కమిటీ చైర్మన్లు బానోతు రవిచందర్, రేగ కళ్యాణి, ఎస్సీ కార్పొరేషన్‌‌ ఈడీ తుల రవి, ఏపీఎం శ్రీనివాస్‌‌, భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్‌‌ రాహుల్‌‌శర్మ, డీఆర్‌‌డీఏ పీడీ బాలకృష్ణ, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, భూపాలపల్లి మార్కెట్‌‌ కమిటీ చైర్మన్‌‌ గూటోజు కిష్టయ్య పాల్గొన్నారు. అంతకుముందు మంగపేటలోని కస్తూరిబాయి మహిళా మండలి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి దుప్పట్లు పంపిణీ చేశారు.