
- రాజ్యాంగం కల్పించిన హక్కులతో ఎమ్మెల్యే, మంత్రిని అయిన: సీతక్క
- మహిళా పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏ కోర్టులో తనను నక్సలైట్‌గా చూశారో.. అదే కోర్టులో అడ్వకేట్‌గా జడ్జి ముందు నిలబడ్డానని మంత్రి సీతక్క అన్నారు. బైండోవర్లు, నక్సల్ కేసుల్లో తనను వరంగల్ కోర్టులో ప్రవేశపెట్టేవారని గుర్తు చేసుకున్నారు. పట్టుదలతో లా చదివి అదే కోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశానని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో మహిళా పోలీసుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ సెల్ అవసరం ఉందన్నారు. మహిళా పోలీసుల సమస్యలు నేరుగా డీజీకి చేరేలా మెసేజ్ బాక్స్ లేదా ఇతర విధానం ఉండాలని అన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు. ఇక్కడి మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారమార్గాలపై రాష్ట్ర పోలీస్ అకాడమీలో 3 రోజుల సదస్సు జరుగుతున్నది. బుధవారం సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు.
శుక్రవారం వరకు జరగనున్న ఈ సదస్సులో కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి అధికారులందరూ 5 గ్రూపులుగా ప్యానల్ డిస్కషన్ చేయనున్నారు. మహిళా పోలీసుల సమస్యల పరిష్కాలకు అవసరమైన నివేదికను సీఎంకు అందజేయనున్నారు. తొలిరోజు సదస్సులో మంత్రి సీతక్క మాట్లాడారు. అన్ని రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ మహిళలు ముందుకెళ్లాలన్నారు.
మహిళల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎల్లవేళలా సహకరిస్తుందని తెలిపారు. మహిళా శిశు సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా పోలీస్ అధికారులకు పూర్తి ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో మహిళా అధికారులకు ప్రత్యేకమైన సౌకర్యాలపై స్టడీ చేసేందుకు ఒక టీమ్ ఏర్పాటు చేయాలని కోరారు.
అంగన్‌వాడీ చిన్నారులకు త్వరలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్
అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు త్వరలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని 139 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ స్కీమ్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయగా.. పిల్లల హాజరు 30 శాతం పెరిగినట్లు తెలిపారు. అందుకే త్వరలో పలు జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు.
పిల్లల పోషకాహారాన్ని మెరుగుపరచడానికి ప్రతి చిన్నారికి ఉదయం 100 మి.లీ. పాలు, వారంలో ఒక రోజు ఎగ్ బిర్యానీ, మరొక రోజు వెజిటేబుల్ కిచిడీ అందించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. బుధవారం ఆమె ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ఆఫీసులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొత్త అంగన్‌వాడీ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అన్నారు.