
- ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి
- అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
- దెబ్బతిన్న రోడ్లపై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో ఆదివారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులపైనా, దెబ్బతిన్న రోడ్లపైనా సమీక్షించారు.
మంత్రి మాట్లాడుతూ వర్షాలు తగ్గిన వెంటనే తాత్కాలిక రిపేర్లు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారులు, కల్వర్టులు, భవనాల పునరుద్ధరణలో ఆలస్యం చేయకుండా పనులు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.
ఇప్పటి వరకు మొత్తం 86.55 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయని మంత్రికి అధికారులు నివేదించారు. ఈ రహదారుల తాత్కాలిక రిపేర్లకు రూ. 6.5 కోట్లు, శాశ్వత రిపేర్లకు రూ.143 కోట్ల అవసరమని అంచనా వేసినట్లు తెలిపారు. రహదారులు, ఇతర మౌలిక వసతుల పునరుద్ధరణకు రూ.150 కోట్ల వరకు అవసరమవుతుందని మంత్రికి అధికారులు వివరించారు.
రవాణా సంబంధాలు తెగిపోయిన కొన్ని గ్రామాలకు మళ్లీ కనెక్టివిటీ పునరుద్ధరించామని ఈఎన్సీ అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమిలి మండలంలోని కర్జిభీంపూర్, రాజారం గ్రామంతో పాటు ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని రాజూర్ గ్రామానికి కూడా రవాణా సంబంధాలను రెస్టోర్ చేశామన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.