మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి : మంత్రి సీతక్క

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి : మంత్రి సీతక్క

ములుగు, వెంకటాపూర్​(రామప్ప), తాడ్వాయి, వెలుగు : మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని, వారి సంతోషం, ఆర్థిక అభివృద్ధే సంకల్పంగా సీఎం రేవంత్​ రెడ్డి పనిచేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లాలో మంత్రి కలెక్టరేట్​తోపాటు వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు కలెక్టర్​ దివాకర, అడిషనల్​ కలెక్టర్​ సంపత్​రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్​ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్​​రేగ కల్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్​ కొండం రవీందర్​ రెడ్డితో కలిసి ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేశారు. మొత్తం 42,171మంది మహిళలకు ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబాకర్​ చెక్కులు అందించారు.  

జాతర పనులను యజ్ఞంలా పూర్తిచేయాలి.. 

మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను యజ్క్షంలా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన జరిగేలా చొరవ తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. శనివారం రాత్రి తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. కలెక్టర్​ దివాకర, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రాతో కలిసి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 అనంతరం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో సమీక్ష నిర్వహించారు. జాతర నేపథ్యంలో మల్లంపల్లి, కటాక్షపూర్ హైవే మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మంగపేట బస్టాండ్ నిర్మాణ పనులు డిసెంబర్ 20లోగా పూర్తి చేయాలన్నారు. రాత్రింబవళ్లూ పనులు  జరుగుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు.