ములుగు/ తాడ్వాయి వెలుగు : ములుగు జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా అని, ప్రకృతి ప్రేమికులుగా అడవులను కాపాడుకుంటేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సరస్సు, అటవీ, ఆధ్యాత్మిక, పర్వత పర్యాటక ప్రాంతాలు ఒకేచోట ఉన్న అరుదైన జిల్లాగా ములుగు ప్రత్యేక గుర్తింపు పొందిందని, రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా, నియోజకవర్గంగా ములుగు అగ్రస్థానంలో ఉందని తెలిపారు. మేడారాన్ని మరింత పచ్చదనంతో తీర్చిదిద్ది, అటవీ సంపదను భావితరాలకు అందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇంచర్ల ఏకో పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సీతక్క, కాళేశ్వరం జోన్ అటవీ సంరక్షణాధికారి బి.ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఇంచర్ల సర్పంచ్ కుమార్ గౌడ్ తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం తాడ్వాయి మండలం బందాలలో బొల్లెపల్లి నుంచి పోచాపూర్ వరకు రూ.5 కోట్లతో, పోచాపూర్ నుంచి అల్లిగూడెం వయా నర్సాపూర్ వరకు రూ.6 కోట్లతో బీటీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పోచాపూర్ ఆశ్రమ పాఠశాల, లింగాల జీపీలలో నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమాల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, పోచాపూర్-నర్సాపూర్-అల్లిగూడెం రహదారి అభివృద్ధితో పాటు పలు అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజా దర్బార్‌లో అందిన ప్రతి దరఖాస్తును పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు 20 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం శ్రీగంధం మొక్కలను పంపిణీ చేశారు. దేవగిరిపట్నం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి అనే రైతు అడవి పందుల దాడిలో మరణించగా కుటుంబానికి అటవీశాఖ రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేశారు. సమ్మక్క-సారలమ్మ స్మృతి వనం పోస్టర్, తాడ్వాయి హట్స్ పర్యాటక ప్రచార పోస్టర్‌లను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎఫ్వో వికాస్ మీనా, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టొప్పో, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్లో మంత్రి సీతక్క కలెక్టర్ స్నేహ శబరీశ్తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
