బిల్లు ఆమోదం కోసం అవసరమైతే పార్లమెంటును స్తంభింప చేస్తాం : మంత్రి సీతక్క

బిల్లు ఆమోదం కోసం అవసరమైతే పార్లమెంటును స్తంభింప చేస్తాం : మంత్రి సీతక్క

 కామారెడ్డి, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఢిల్లీ స్థాయిలో 3 రోజుల పోరాటం చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బిల్లు ఆమోదం కోసం అవసరమైతే పార్లమెంట్​ను స్తంభింపచేస్తామని తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... బిల్లు చట్టబద్ధత కోసం రాష్ట్రపతిని కలుస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ బిల్లు ఆమోదం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతామన్నారు.

 బీసీ బిల్లుపై అభ్యంతరాలు ఉంటే చర్చిద్దాము తప్ప కొట్లాటలు సృష్టించవద్దన్నారు. గ్రామపంచాయతీలకు గత రెండేళ్లుగా ఎన్నికలు లేక రూ.6 వేల కోట్ల వరకు నష్టపోయామన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. బీసీ బిల్లుపై అభ్యంతరాలు ఉంటే పార్లమెంట్​లో చర్చకు పెట్టాలన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్  అలీ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రమంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ పేరుకు మాత్రమే బీసీ జపం చేస్తుందని విమర్శించారు.