హైదరాబాద్, వెలుగు: అంగన్‌వాడీ సెంటర్లకు సరుకుల సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. పాలు, గుడ్లు, పప్పు, మంచి నూనె, బాలమృతం, మురుకులు, బియ్యం వంటి వస్తువుల సరఫరా కొన్ని జిల్లాల్లో 50 శాతానికి కూడా చేరకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా సరఫరాదారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చి, బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను ఆదేశించారు.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాల పురోగతిపై సీతక్క జిల్లా అధికారులతో శుక్రవారం సెక్రటేరియెట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లలో విద్యుత్ కనెక్షన్, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉదయం 9 గంటల్లోపు అంగన్వాడీ సెంటర్లు తప్పనిసరిగా ప్రారంభం కావాలని చెప్పారు. సెంటర్లు ఆలస్యంగా తెరుచుకుంటే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. టేక్ హోమ్ రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 90 శాతం లబ్ధిదారులు ఎఫ్‌ఆర్ఎస్ విధానంలో సరుకులు అందుకుంటుండగా, దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
చిన్నారుల హాజరును పెంచాలి..
అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు గర్భిణుల హాజరు 80 శాతం, బాలింతల హాజరు 85 శాతం ఉండటంపై మంత్రి సీతక్క సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీలో చిన్నారుల హాజరు ప్రస్తుతం 68 శాతం ఉండగా, దాన్ని 90 శాతానికి పెంచాలన్నారు. జిల్లా అధికారులు ప్రతి నెలా పురోగతి నివేదికలను సమర్పించాలన్నారు.
బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని పిలుపునిచ్చిన సీతక్క.. ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, శక్తి సదనాలు, స్టే హోమ్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను అధికారులు క్రమం తప్పకుండా సందర్శించి పర్యవేక్షించాలని సూచించారు.
